Friday, August 5, 2016

ముద్దుగారే రోహన్!

ఆరోజు.. 

బాలల దినోత్సవం! శుక్రవారం... 

అప్పటికే నన్ను ముప్పు తిప్పలు పెట్టి , మూడు సార్లు హాస్పిటల్ లో మాక్ రన్ చేయించిన నా బుజ్జాయి... కేర్ కేర్ మంటూ ఈ భూమ్మీద అడుగుపెట్టిన రోజు... మావాడి పుట్టినరోజు. 

మా మావగారు  మళ్ళీ పుట్టారు అన్నారు అందరు..  నెహ్రు అంతటివాడు అవుతాడన్నారు  కొందరు . మఖా నక్షత్రం, సింహ రాశి .... ఇంట్లో అందరు సింహాలే ఇందు తప్ప ....  అదీ ఇదీ అని ఒకటే గోల! 

ఇవేమి పట్టట్లేదు నాకు .... మావాడిని మొదటిసారి చూసినప్పుడు  ఒక చిన్న గులాబీ రేకు విచ్చుకున్న అనుభూతి.  ఆ పూవు రెక్కలు విప్పి ఈ లోకాన్ని తీరిగ్గా పరికిస్తున్న అనుభూతి ....  పెద్దపెద్ద కళ్ళతో నన్ను ఆశ్చర్యంగా చూసిన మొదటి చూపు... మా ఇద్దరి చూపులు కలిసిన క్షణం ....  ఆహా ! ఎప్పటికి మర్చిపోలేను నాకు అల్జీమర్స్ వచ్చినాసరే!

'హలో బేబీ!' అని మాత్రం అనగలిగాను నా చూపుడువేలిని వాడి సుతిమెత్తని బుగ్గకి తాకిస్తూ...  (జావాలో 'హలొ వరల్డ్ ! ' ప్రోగ్రామ్  రాసిన ఎక్స్పీఎరియన్స్ అనుకుంటా  ;) )


ఒత్తైన జుట్టు , పల్చటి ఎర్రని పెదాలు , పెద్ద పెద్ద కళ్ళు (ఆ మొహంలో  కళ్ళు తప్ప ఏవి కనిపించేవి కాదు మొదట్లో ), కుదురైన ముక్కు (ఎంతమంది వంకలు పెట్టినా సరే... ), పొడుగాటి గోళ్లు .. కలగలిసి ఒక బుజ్జి పాపాయి . అచ్చమ్ నా చిన్ని కృష్ణుడే మళ్ళీ పుట్టాడు అనిపించింది . 

మావాడికి పేరు పెట్టేసేయాలి రెండు రోజుల్లో అని చెప్పారు .  తొమ్మిది నెలలు అన్ని పేర్ల పుస్తకాలు, విష్ణు సహస్రనామాలు, వెబ్సైట్లు జల్లెడపట్టాక ... ఫైనలైజ్ చేసుకున్నవి ఏమిటనగా .... 

'కృష్ణ తేజ్' వాడికి మొదట అనుకున్న పేరు .
'అర్జున్' నాకు ఇష్టమైన పేరు. 
'ప్రణవ్' నచ్చిన పేరు 

'కృష్ణ తేజ్' ...'రా.చ  తేజ్ ' లాగ ఉందని  నాకు నచ్చలేదు. 
పూర్వాశ్రమంలో , చందుగారింట్లో  కుక్క పేరు 'అర్జున్'.  ప్చ్! ఈ పేరు పెట్టలేను 
'ప్రణవ్ ' అంటే.. పవన్ కళ్యాణ్  దయవల్ల  నాకు బ్రహ్మానందం  గుర్తొచ్చాడు(ప్రణవ్... ది హెడ్ కానిస్టేబుల్ ) . ఇదీ  పెట్టలేను. 

అందువల్ల మా వాడికి పేర్లకి కరువొచ్చింది. 

రోహిణి నక్షత్రం రోజున పుడితే అమ్మాయి అయితే రోహిణి అని పెట్టొచ్చు .. మరి అబ్బాయి ఐతే? అని చందు కి డౌట్ వచ్చింది . 'రోహన్' అని పెడతాం  అనుకున్నాం. నవ్వుకున్నాం. 

కానీ, మావాడు రోహిణి నక్షత్రం రోజున కూడా బైటికి రాకుండా మారాం చేసాడు.  సో! ఆ పేరు పక్కన పెట్టాం . 

మఖ నక్షత్రం రోజున పుట్టాడు ... మఖేష్  అని పెట్టలేం కదా? మరీ ఛండాలంగా ఉంది . అసలే ముఖేష్ దయవల్ల ఆ పేరు కామెడీ అయ్యింది. 

ఇంకేంటి దారి? ఇంకేం పేర్లు లెవా? 

రెండు రోజులు బుర్రలు బద్దలు కొట్టుకున్నాక, ఇక లాభం లేదనుకుని , ఇదేదో బానే ఉంది ... రోహిణి అయినా , కాకాపోయినా ....  పెట్టేద్దాం  అని 'రోహన్' కి ఫిక్స్ అయ్యాము!

అలా  మావాడు రోహన్ అయ్యాడు ....  ఈ బ్లాగు రోహనీయం అయ్యింది. 

ముద్దుగారే ఇందు  ముంగిట ముత్యం వీడు.... 
తిద్దరాని మహిమల....చందు  సుతుడూ ...

-రోహన్ గారి అమ్మ (ఇందు)

1 comment:

  1. ప్రియమైన ఇందు, రోహానీయం కంటే
    ముందు నీ అద్భుతమైన రచనా శైలి నాకు
    బాగా నచ్చింది. రాయటంలో ఉన్న నీ అభిరుచి నాకు నచ్చింది. ఇలా మా
    అందరిని అలరిస్తున్నందుకు అభిమానందనాలు























    ReplyDelete